ఎంసెట్‌లో మీ ర్యాంకు అంచనా!
ఇంటర్ తరవాత విద్యార్థులు రాసే ప్రవేశ పరీక్షల్లో అధిక భాగం పూర్తయ్యాయి. ఇప్పుడిక ఏ విద్యాసంస్థలో చేరాలి, విధి విధానాలు ఎలా ఉంటాయి? అనే అంశాలపైనే విద్యార్థుల ఆలోచనలు! ఎం.పి.సి./ బై.పి.సి. విద్యార్థులు ఎంసెట్‌లో వచ్చే మార్కుల ఆధారంగా వివిధ కళాశాలల్లో చేరే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి.
వెయిటేజి లెక్కింపు
తుది ర్యాంకు నిర్థారణకు ఎంసెట్ మార్కులను 75కు కుదించి మిగిలిన 25 మార్కులకు ఇంటర్ వెయిటేజిని లెక్కిస్తారు. ఇంటర్ వెయిటేజి కోసం కేవలం గ్రూపు సబ్జెక్టుల్లో 600 మార్కులకు విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో వాటిని 25కి కుదిస్తారు.
ఇంటర్‌లో గ్రూపు సబ్జెక్టుల్లో విద్యార్థికి 24 మార్కుల తేడా వస్తే తుది వెయిటేజిలో ఒక మార్కు తేడా వస్తుంది.
ఉదా: ఒక విద్యార్థి 600 మార్కులకు 500 మార్కులు సాధిస్తే అతను పొందే తుది వెయిటేజి 500/600ప25= 20.83.
ఎంసెట్‌లో సుమారుగా ప్రతి రెండు మార్కులకూ తుది వెయిటేజిలో ఒక మార్కు మారుతుంది. అందువల్ల తుది ర్యాంకు నిర్థారణలో ఎంసెట్ మార్కుకు అధిక ప్రాధాన్యం!
విశ్వవిద్యాలయ కళాశాలలో...
ఎంసెట్‌లో 100 మార్కుల పైన సాధించినవారికి విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉంది. 80 పైన సాధించిన విద్యార్థులు కూడా పాత ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందడానికి వీలుంది.
మెడికల్ విభాగం సంగతి?
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది కాబట్టి కటాఫ్ మార్కు పెరుగుతుంది. గత సంవత్సరం 107 మార్కుల వరకు మెడిసిన్‌లో సీటు వచ్చింది. కానీ ఈ ఏడాది ఈ మార్కు 115 మార్కులకు పెరిగే అవకాశం ఉంది. రిజర్వేషను విద్యార్థులకూ, జనరల్ కేటగిరి వారికీ మెడిసిన్ విభాగంలో పెద్దగా తేడా ఉండటం లేదు. గరిష్ఠంగా రెండు లేదా మూడు మార్కుల వ్యత్యాసం ఉంటుంది. అంటే రిజర్వేషను విద్యార్థులు కూడా 110 మార్కులపైనే సాధించవలసి ఉంటుంది.
గత ఏడాది...
గత సంవత్సరం 136 మార్కుల పైన వచ్చిన విద్యార్థులు ఉస్మానియా పరిధిలోని ప్రభుత్వ కళాశాలలోనూ, 122 మార్కుల పైన వచ్చినవారు ప్రైవేటు కళాశాలలో కేటగిరి- ఎ లోనూ, 115 మార్కుల పైన వచ్చిన వారు కేటగిరి- బి లోనూ సీటు సాధించారు.
ఉస్మానియా కంటే ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 4 మార్కుల వరకు తక్కువగా ఉన్నా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఆంధ్రా యూనివర్సిటీ కంటే ఇంకా ఐదు మార్కులు తక్కువగా ఉన్నా సీటు పొందారు. ఈ సంవత్సరం కూడా యూనివర్సిటీ పరంగా ఇదేవిధంగా లెక్కించవచ్చు.
కేటగిరి- ఎ లేదా కేటగిరి- బిలో మార్పు ఫీజు మాత్రమే. కేటగిరి- ఎ అయితే రూ. 65 వేలు. కేటగిరి 'బి' అయితే రూ. రెండు లక్షల వరకు సంవత్సరానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలలో ఫీజు రూ. పది వేలు ఉంటుంది.
ఎం.బి.బి.ఎస్. ప్రాధాన్యం ఎంత ఉందో ఇప్పుడు బి.డి.ఎస్.కు కూడా దాదాపు అంతే ప్రాధాన్యం ఉంది. ఈ సంవత్సరం తుది ఎంసెట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విద్యార్థులు ఏ కోర్సుకు వెళ్లేదీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
No comments:
Post a Comment